గణంగా పల్లె పండుగ ప్రారంభం
పనుల ప్రగతిపై ప్రభుత్వం ఫోకస్
మచిలీపట్నం – పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామంలో లాంఛనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉపాధి హామీ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 4,500 కోట్ల రూపాయల వ్యయంతో 30 వేల పనులు, 8 లక్షల కుటుంబాలకు ఉపాధి హామీ వంద రోజుల పని దినాలు, 3 వేల కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం, 25 వేల గోకులాల నిర్మాణం, 10 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ కందకాలు తవ్వకం పనులకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
అలాగే కంకిపాడు గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 95.15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 11 అంతర్గత సిమెంటు రహదారులు , రెండు మినీ గోకులాల నిర్మాణానికి , పునాదిపాడు గ్రామ పంచాయతీలో 52 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 2 అంతర్గత రహదారుల నిర్మాణానికి 54 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సామాజిక ఆరోగ్య కేంద్రం ప్రహరీ నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ శశి భూషణ్ కుమార్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా పోలీస్ అధికారి ఆర్ గంగాధర్ రావు, పెనమలూరు, గుడివాడ, పామర్రు, పెడన శాసనసభ్యులు బోడె ప్రసాద్, వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్ పలువురు జిల్లా అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.