అల్ప పీడనం రాష్ట్రం అప్రమత్తం
హోం మంత్రి అనిత వంగలపూడి
విశాఖపట్నం – బంగాళా ఖాతంలో అల్ప పిడనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని స్పష్టం చేశారు ఏపీ రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి. సోమవారం ఆమె సమీక్ష చేపట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయ్యిందన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లతోనూ మాట్లాడడం జరిగిందన్నారు. ఎలాంటి ప్రమాదం జరగకముందే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించుతున్నామని చెప్పారు వంగలపూడి అనిత.
తుఫాను వల్ల ఏ ప్రాంతాలు ప్రమాదానికి గురవుతాయో ముందుగా గుర్తించామని, అక్కడికి బృందాలను పంపిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే అన్ని ప్రభుత్వ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించామన్నారు.
తుఫాను షెల్టర్‌లు సిద్ధం చేశామన్నారు. చిత్తూరు, కర్నూలు, తిరుపతి, ప్రకాశం, ప్రాంతాలను ముందుగా అప్రమత్తం చేశామని స్పష్టం చేశారు వంగలపూడి అనిత.
ప్రతి మండలంలోనూ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉండేలా ఏర్పాటు చేశామన్నారు. గంట గంటకు ఎంత వర్షపాతం నమోదు అయిందో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
సెలవుల్లో ఉన్న అధికారులు కూడా విధుల్లోకి వస్తున్నారని వెల్లడించారు రాష్ట్ర హొం శాఖ మంత్రి.