సీఎం ఫాక్స్ కాన్ కంపెనీ సందర్శన
చైర్మన్ తో వీడియో కాన్ఫరెన్స్
రంగారెడ్డి జిల్లా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ లోని ఫాక్స్ కాన్ కంపెనీని సందర్శించారు. ఆయన వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు.
ఈ సందర్బంగా ఫాక్స్ కాన్ కంపెనీని సందర్శించిన సీఎం కంపెనీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. వివిధ అంశాలకు సంబంధించి వారితో చర్చించే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఇదిలా ఉండగా కంపెనీని సందర్శించిన రేవంత్ రెడ్డి నేరుగా ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లియుతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కంపెనీ పురోగతి, ఇతర సంబంధిత విషయాలను అడిగి తెలుసుకున్నారు.
అవసరమైన మౌలిక సదుపాయాలకు సంబంధించి ఎలాంటి ఆందోళనలు లేవని కంపెనీకి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
వివిధ రంగాల్లో మరిన్ని పెట్టుబడులను అన్వేషించాలని ఫాక్స్‌కాన్‌ను కోరారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ , లిథియం బ్యాటరీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీకి సహకారం అందజేస్తామన్నారు.