భారీ వర్షాలతో జర భద్రం – సీఎం
నీటి పారుదల శాఖపై సమీక్ష
అమరావతి – ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర వాతావరణ శాఖ అప్రమత్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సోమవారం సచివాలయంలో నీటి పారుదల శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమీక్ష లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.
భారీ వర్షాలపై వాతావరణ శాఖ సూచనలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. కాలువలు, చెరువులు, ప్రాజెక్టుల వద్ద పర్యవేక్షణతో పాటు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఏ ఒక్కరూ నిర్లక్ష్యం వహించ కూడదని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం. ఇదే సమయంలో అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు సీఎం.
బాధితుల కోసం హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, టెక్నాలజీని ఉపయోగించు కోవాలని, వాతావరణ శాఖ అందించే సలహాలను , సూచనలను మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారం చేర వేయాలని స్పష్టం చేశారు.