అల్ప పీడనం రాష్ట్రం అప్రమత్తం – అనిత
ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్న మంత్రి
అమరావతి – ఏపీ రాష్ట్ర హోం , విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత వంగలపూడి ఆగ్నేయ బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రాష్ట్ర వాతావరణ శాఖ అప్రమత్తం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సోమవారం అనిత మీడియాతో మాట్లాడారు.
భారీ వర్షాలపై వాతావరణ శాఖ సూచనలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించామని చెప్పారు. కాలువలు, చెరువులు, ప్రాజెక్టుల వద్ద పర్యవేక్షణతో పాటు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. ఏ ఒక్కరూ నిర్లక్ష్యం వహించ కూడదని స్పష్టం చేసినట్లు తెలిపారు అనిత వంగలపూడి.
ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు . ఇదే సమయంలో అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించినట్లు చెప్పారు .
బాధితుల కోసం హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, టెక్నాలజీని ఉపయోగించు కోవాలని, వాతావరణ శాఖ అందించే సలహాలను , సూచనలను మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారం చేర వేయాలని స్పష్టం చేశారు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి.
అల్ప పీడనం నేపథ్యంలో తమ సర్కార్ పూర్తిగా అప్రమత్తతో ఉందన్నారు. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలు దిగాయని, ప్రతి మండలంలో కమాండ్ కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామన్నారు.