మద్యం పేరుతో దోచుకున్నది నువ్వు కాదా
మాజీ సీఎం జగన్ రెడ్డిపై నారా లోకేష్ ఫైర్
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. సోమవారం మద్యం పాలసీపై జగన్ చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎక్స్ వేదికగా స్పందించారు.
మద్య నిషేధం చేస్తానని, మద్యం తయారు చేసి, మద్యం అమ్మి, మద్యం మీద వచ్చే ఆదాయం దోచేసిన నువ్వు మద్యం పాలసీ గురించి మాట్లాడుతున్నావా జగన్ అని నిలదీశారు నారా లోకేష్. మద్య నిషేధం అని చెప్పి పాలసీలు మార్చి దోచేసింది నువ్వ కాదా అని ప్రశ్నించారు.
ధరలు పెంచుకుంటూ పోతే తాగేవాళ్లు తగ్గుతారని, జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పిన విషయం మరిచి పోతే ఎలా అని అన్నారు. కొత్తగా తెచ్చిన మద్యం పాలసీ వల్ల 72 శాతం అమ్మకాలు పెరిగాయని, విచ్చలవిడిగా అమ్మకాలు పెంచారని ఆరోపించారు. సగటున మద్యం సేవించే వారి సంఖ్య 2019-2020 మధ్యన 5.55 నుండి 6.23 శాతానికి పెరిగింది వాస్తవం కాదా అన్నారు. రేట్లు పెంచి లిక్కర్ అమ్మకాలు తగ్గిస్తామని చెప్పినప్పటికీ భారీగా వినియోగం పెరిగిందని, ఇదేనా సైకో జగన్, నువ్వు చెప్తున్న నీ గొప్ప లిక్కర్ పాలసీ అంటూ ఎద్దేవా చేశారు.
రూ.50 మందు రూ.250కి అమ్మిన నువ్వు చేసింది మద్యం వ్యాపారం కాదా అంటూ ఫైర్ అయ్యారు నారా లోకేష్. ఈ నకిలీ మద్యం తాగి ఎంత మంది చనిపోయారో, మన ఊరిలో మన కళ్ళ ముందే అనేక మంది కనిపిస్తున్నారు. ఇక ఇంత రేటు పెట్టి మద్యం తాగలేక గంజాయికి, నాటు సారాకి బానిసలు అయ్యారని వాపోయారు. ఈ పాపానికి కారణం నువ్వు కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఐదేళ్ల పాటు అమ్మిన మద్యానికి డిజిటల్ చెల్లింపుల్లో కాకుండా కేవలం నగదు రూపంలో విక్రయించి రూ. 99,413.50 కోట్లు తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. డిజిటల్ చెల్లింపుల రూపంలో కేవలం రూ.615 కోట్లు మాత్రమే తీసుకున్నారు. ఈ రోజుల్లో తోపుడు బండ్ల వాళ్లు కూడా ఆన్ లైన్ పేమెంట్ తీసుకుంటుంటే ఇక్కడ మాత్రం అసలు ఆన్ లైన్ పేమెంటు అనేదే లేకుండా చేశారు. బిల్లు ఇవ్వండని అడిగిన వారిని అరెస్టులు చేసింది నిజం కాదా అని నిలదీశారు నారా లోకేష్. ఈ డబ్బు మొత్తం నీ తాడేపల్లి కొంపకి తరలించింది వాస్తవం కాదా అని ధ్వజమెత్తారు.
నువ్వు అధికారంలోకి రాగానే, డిస్టిలరీస్ అన్నీ మిథున్‌రెడ్డి చేతిలోకి వెళ్ళింది వాస్తవం కాదా ? తయారీ నుంచి సరఫరా వరకూ విజయసాయి రెడ్డి, మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి, సుబ్బారెడ్డి అయితే వెనుక ఉన్నది నువ్వు కాదా జగన్ రెడ్డి అని ఫైర్ అయ్యారు. 2019లో నువ్వు వచ్చిన తరువాత తెచ్చిన మద్యం పాలసీని మార్చడం వల్ల ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని ఆరోపించారు నారా లోకేష్.
మీ దోపిడీ కోసం బేవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ నుండి వాసుదేవరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చింది నువ్వు కాదా అని అన్నారు. ఏపీ బేవరేజేస్ లో వంద కంపెనీలు మద్యం తయారు చేస్తుంటే అందులో 74 శాతం మద్యాన్ని నాటి నీ ప్రభుత్వం కొనుగోలు చేసింది నిజం కాదా. ఇందులో 16 కంపెనీల నుంచి. అవన్నీ నీ బినామీ కంపెనీలే కాదా అని నిలదీశారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై స్పెషల్ డ్యూటీ (పన్ను) అని వసూలు చేసావ్. కానీ ఆ మొత్తం ఎక్కడికి వెళ్లిందో, ఇప్పటికీ తెలియడం లేదన్నారు.
2014-19 మధ్య 31 బ్రాండ్ల లిక్కర్ బాటిల్ ధర రూ.50 నుండి రూ.70 మధ్యనే ఉండేదని, 2019-24 మధ్య ఆ బ్రాండ్లన్నీ రద్దు చేసి కేవలం 2 బ్రాండ్లకు సంబంధినవి విక్రయించారని ఆరోపించారు. ఆదాన్, గ్రేసన్, లీలా, జేఆర్ అసోసియేట్స్, పీవీ స్పిరిట్స్ ఇలా పలు కంపెనీలు 2 వేల లక్షల లీటర్లు విక్రయించి రూ.20,356 కోట్లు ఆర్జించింది మరిచి పోతే ఎలా జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్.
నీ నాసిరకం జే-బ్రాండ్స్ తాగి, 2019-24 మధ్య కిడ్నీలు పాడైన వారు 52 శాతం ఉండగా, ఊపిరితిత్తులు పాడైన వారు 54 శాతం పెరిగారని, ఇది నువ్వు తెచ్చిన జే-బ్రాండ్స్ విషం కాదా అని నిలదీశారు.
ప్రజలని దోపిడీ చేసే నీ మద్యం పాలసీ రద్దు చేసి, నూతన మద్యం విధానానికి శ్రీకారం చుట్టామన్నారు. 3,736 ప్రైవేటు రిటైల్ షాపులకు టెండర్లు పిలిస్తే, 90 వేల మంది వచ్చారు. రూ.1800 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందన్నారు. పారదర్శకంగా లాటరీ ద్వారా షాపుల కేటాయింపు జరిగింది. ఇది మా విధానమని స్పష్టం చేశారు నారా లోకేష్.