పరిశ్రమల స్థాపనకు ఏపీ సిద్ధం – లోకేష్
ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు
ఢిల్లీ – ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం పారిశ్రామికేవత్తలు, పెట్టుబడిదారులు, కంపెనీలు ఏర్పాటు చేసేందుకు తమ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సిద్దంగా ఉందని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
సోమవారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన యూఎస్ ఐఎస్పీఎఫ్ ( USISPF) ఇండియా లీడర్ షిప్ సమ్మిట్‌కు హాజరయ్యారు నారా లోకేష్. పరిశ్రమలు స్థాపనకు ఏపీలో అనువైన వాతావరణం ఉందని స్పష్టం చేశారు.
స్టార్టప్ (అంకురాలు) ఆంధ్ర నినాదం మాత్రమే కాదని.. పాలనా విధానాన్ని మార్చే ఆయుధం అని పేర్కొన్నారు. వరదల సమయంలో వేగవంతమైన సేవలకు స్టార్టప్‌లు అందించిన సహకారం అద్భుతమని కొనియాడారు నారా లోకేష్.
ప్రైవేటు రంగం సహకారంతో 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించి తీరుతామని ప్రకటించారు ఏపీ ఐటీ, కమ్యూనికేషన్స్, విద్యా శాఖ మంత్రి. అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా ఒక్కో జిల్లాలో ఒక్కో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళిక తయారు చేశామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు నారా లోకేష్.