NEWSANDHRA PRADESH

ఏఐ రాజ‌ధానిగా అమ‌రావ‌తి – నారా లోకేష్

Share it with your family & friends

భారీ ఎత్తున రాష్ట్రానికి కంపెనీలు రాక

ఢిల్లీ – ఏపీ విద్యా, ఐటీ, క‌మ్యూనికేష‌న్స్ శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రానికి సంబంధించి అమరావతిని వరల్డ్ క్లాస్ ఎఐ రాజధానిగా తీర్చిదిద్ద బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో టైమ్స్ నౌ న్యూస్ ఛాన‌ల్ తో జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న ఈ విష‌యం వెల్ల‌డించారు.

త‌మ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు సైబరాబాద్ ను అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో నిలిపారని అన్నారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామ‌ని స్ప‌ష్టం చేశారు నారా లోకేష్.

రైతుల భాగస్వామ్యంతో వరల్డ్ క్లాస్ సిటీగా తయారు చేసేందుకు గాను ఇప్ప‌టికే ప్రణాళికలు సిద్ధం చేశామ‌ని చెప్పారు . ఎస్ఆర్ఎం, విఐటి వంటి సంస్థలు ఇప్పటికే ఆ ప్రాంతంలో తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయ‌ని తెలిపారు నారా లోకేష్.

ఇక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 100 రోజుల్లో టిసిఎస్, లూలు కంపెనీలు వ‌చ్చాయ‌ని అన్నారు.
రెన్యువల్ ఎనర్జీ, పెట్రో కెమికల్స్, ఫార్మా కంపెనీలతో చర్చలు కొలిక్కి వచ్చాయ‌ని వెల్ల‌డించారు. ఎలాన్ మస్క్‌తో ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.

టెస్లా కంపెనీకి సంబంధించిన కార్ల‌ను ఇక్క‌డికి తీసుకు రావాల‌ని 2015 నుంచి నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నాలు చేస్తూ వ‌స్తున్నార‌ని, త్వ‌ర‌లోనే ఇక్క‌డికి వ‌స్తుంద‌ని తాము ఆశిస్తున్న‌ట్లు పేర్కొన్నారు నారా లోకేష్.

ఇక ఏపీని దేశంలోనే పెట్టుబడుల గమ్యస్థానంగా నిలపడమే త‌మ లక్ష్యమ‌ని స్ప‌ష్టం చేశారు.