గురుకులాలపై సర్కార్ వివక్ష తగదు
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రోజు రోజుకు కుంటు పడుతోందని ఆవేదన చెందారు. మంగళవారం ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు విద్యా శాఖ మంత్రిని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ప్రభుత్వ బడులను, కాలేజీలను , గురుకులాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నేటి దాకా సర్కార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకులాలకు ఇప్పటి వరకు అద్దెలు చెల్లించక పోవడం దారుణమన్నారు. గత 10 నెలలుగా అద్దెలు చెల్లించక పోవడంతో భూపాలపల్లి జిల్లాలో యజమాని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కు తాళం వేశారని, ఇది దారుణమన్నారు.
కాంగ్రెస్ అసమర్థ పాలనలో గురుకులాల నిర్వహణ అద్వాన్న స్థితికి చేరుకున్నదనడానికి ఇది మరొక నిదర్శనమని పేర్కొన్నారు తన్నీరు హరీశ్ రావు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్ర పోతున్నారా అని ప్రశ్నించారు. గురుకులాలకు అద్దెలు ఇంకెప్పుడు చెల్లిస్తారంటూ నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజురోజుకి దిగజారి పోతున్న విద్యావ్యవస్థ గురించి విద్యా శాఖ మంత్రిగా ఉన్న మీరు.. ఇంకెప్పుడు పట్టించుకుంటారని మండిపడ్డారు .