112..100 నంబర్లకు ఫోన్ చేయండి
పోలీస్ వ్యవస్థ తక్షణమే స్పందిస్తుంది
అమరావతి – రాష్ట్రంలో ఎవరికైనా ఇబ్బందులు తలెత్తినా లేదా ఎవరైనా తమను వెంటాడినా లేదా అత్యాచార యత్నానికి పాల్పడినా వెంటనే 112, 100 హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు.
నేరం చేయాలంటే భయపడేలా నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చేస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా సదరు నంబర్లకు ఫోన్ చేస్తే వెంటనే ఎక్కడ ఉన్నా సరే పోలీసులు వాలి పోతారని చెప్పారు.
ఇళ్లు, వ్యాపార సంస్థలు, ప్రైవేట్ స్థలాల్లో సీసీ కెమెరాలను కూడా పోలీస్ భద్రత వ్యవస్థతో అనుసంధానం చేసి నేరాలను నియంత్రించేందుకు వ్యూహం రచించినట్లు హోం మంత్రి తెలిపారు. అనుకోని ఘటనలు జరగక ముందే ప్రజలు, వ్యాపారులు తమ ఇళ్లు, వ్యాపార సంస్థల దగ్గర అమర్చుకున్న సీసీలను అనుసంధానం చేసుకుంటే బావుంటుందని అన్నారు.
నిరంతరం పోలీస్ వ్యవస్థ నిఘా పెట్టి ఇబ్బందికర ఘటనలు జరగకుండా అప్రమత్తం చేస్తుందన్నారు. డ్రోన్లు వినియోగించి ముఖ్య ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా కార్యాచరణ రూపొందించనట్లు చెప్పారు వంగలపూడి అనిత.