లోకేష్ కామెంట్స్ షర్మిల సీరియస్
పీఎం మోడీకి సాగిల పడితే ఎలా
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పై నిప్పులు చెరిగారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి. బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. మోడీకి భజన చేయడం మానేసి ఏపీకి ఏం కావాలో ఆలోచిస్తే మంచిదని అన్నారు.
పీఎం మోదీకి మీరు చేసిన వాగ్దానాన్ని నెర వేర్చినందుకు మీరు చాలా గర్వపడుతున్నారు సరే, కానీ ఏపీ ప్రజలకు నెరవేర్చని హామీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడ లేక పోవడం దారుణమన్నారు. ఆయన ఓ న్యూస్ ఛానల్ తో జరిగిన చర్చా వేదికలో తాము అద్బుతమైన ప్రగతి సాధించానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఒక్కటైనా అమలు చేశారా అని నిలదీశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నాలుగు నెలలు గడుస్తున్నా, ఏపీ ముఖ్యమంత్రి ప్రతి వారం ఢిల్లీకి పరుగులు తీస్తున్నా, మోదీ ఏపీకి ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చక పోవడం సిగ్గు చేటు అని అన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా అబద్దాల హామీలపై పునరాలించాలని, ఇచ్చిన సిక్స్ గ్యారెంటీస్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు.