వేల కోట్లు ఏమైనట్టు.. ఎవరి జేబుల్లోకి వెళ్లినట్టు..?
తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై కేటీఆర్ కామెంట్స్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాలను తప్పు పట్టారు. ఇప్పటి వరకు కొలువుతీరిన 10 నెలలో ఏకంగా రూ. 80,500 కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు. ఈ అప్పులు ఎవరి కోసం తీసుకు వచ్చారో, దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. రోజు రోజుకు అప్పులపాలు చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తోందని ఆరోపించారు. ఇలా ఎంత కాలం అప్పులు చేసుకుంటూ పోతారని ప్రశ్నించారు. అప్పులు తీసుకు వచ్చేది అభివృద్ది పనులు చేపట్టేందుకు అని ఆరోజు తాము వెల్లడించామని, కానీ ఎన్నికల సందర్బంగా అప్పులు చేశారంటూ తమపై బురద చల్లే ప్రయత్నం చేశారని మండిపడ్డారు కేటీఆర్.
ఎన్నికల హమీలేవీ తీర్చ లేదు..ఏ కొత్త ప్రాజెక్టు చేపట్టలేదు..మరి తీసుకు వచ్చిన ఆ వేల కోట్లు ఎక్కడికి వెళ్లినట్టు అని నిలదీశారు. ఎవరి జేబులలోకి వెళ్లాయో చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
బడా కాంట్రాక్టర్ల బిల్లులకే ధారాదత్తం చేస్తున్నారా ? కమిషన్ల కోసం కక్కుర్తి పడే అప్పులు తెస్తున్నారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. అప్పు.. శుద్ధ తప్పు అని ప్రచారంలో ఊదరగొట్టి…అవే అప్పుల కోసం ముఖ్యమంత్రి పాకులాడటంలో ఉన్న అర్థం ఏమిటో చెప్పాలన్నారు. అప్పులు చేయడం క్షమించరాని నేరం..అది రాష్ట్రానికి తీరని పెను ప్రమాదమని హెచ్చరించారు కేటీఆర్.