ENTERTAINMENT

మూవీ టికెట్ ధ‌ర‌లు ఫ్లెక్సిబుల్ విధాన‌మైతే బెట‌ర్

Share it with your family & friends

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు గ్రంథి విన్న‌పం

అమ‌రావ‌తి – తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ మాజీ అధ్య‌క్షుడు , పూర్ణా పిక్చ‌ర్స్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ గ్రంథి విశ్వ‌నాథ్ ఏపీ డిప్యూటీ సీఎం, ప్ర‌ముఖ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా సినిమా రంగంలో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేయాల‌ని కోరారు.

ప్ర‌ధానంగా సినిమా టికెట్ ధ‌ర‌ల విష‌యం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ధ‌ర‌లు ఫ్లెక్సిబుల్ విధానంలో ఉంటేనే చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మేలు జ‌రుగుతుంద‌ని విన్న‌వించారు గ్రంథి విశ్వ‌నాథ్. తెలుగు చిత్ర పరిశ్రమకు ఓటీటీతో పాటు సినిమా టికెట్ ధరల విషయంలోనూ ఇబ్బందులు ఉన్నాయ‌ని తెలిపారు.

సినిమా టికెట్ ధరల విషయంలో ఫ్లెక్సిబుల్ విధానం తీసుకు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ విధానం ఇతర రాష్ట్రాల్లో కూడా అమలులో ఉందని తెలిపారు ఏపీ డిప్యూటీ సీఎంకు. ఈ అంశాన్ని పరిశీలించి త‌గు న్యాయం చేయాల‌ని కోరారు గ్రంథి విశ్వ‌నాథ్.

పూర్ణా పిక్చర్స్ శత వసంతాల సావనీర్ ప్రతిని ప‌వ‌న్ కళ్యాణ్ కు అందజేశారు. ఈ సందర్భంగా గ్రంధి విశ్వనాథ్ మాట్లాడుతూ ఓటీటీలు మాత్రమే కాదు. సినిమా టికెట్ ధరలు ఎక్కువ ఉండటం కూడా సమంజసంగా లేదు అనే భావన కూడా పేద ప్రజలను సినిమాకు దూరం చేస్తోందన్నారు. సినిమా రంగాన్ని బతికించడానికి ఫెక్సిబుల్ రేట్ల విధానం తీసుకొస్తే బాగుంటుందని సూచించారు.

దీనిపై ఆలోచన చేయాలి. తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం అమల్లో ఉందన్నారు. కనిష్ఠ, గరిష్ఠ రేట్లను ప్రకటిస్తే సినిమా స్థాయిని బట్టి ఫెక్సిబుల్ రేట్ల విధానంలో ధరలు నిర్ణయించు కుంటార‌ని తెలిపారు.