మూసీ సుందరీకరణపై కేటీఆర్ సమీక్ష
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలతో చర్చ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర సర్కార్, సీఎం ఎ. రేవంత్ రెడ్డి పదే పదే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంటూ ఊదర గొడుతున్నారు. ఏకంగా రూ. 1,50,000 కోట్లు ఖర్చవుతుందని ప్రకటించడం విస్తు పోయేలా చేసింది. రోజు రోజుకు అంచనాలు పెంచడం తప్పితే వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియ చేయకుండా మభ్య పెట్టడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.
బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించారు కేటీఆర్. ఈ సందర్బంగా విస్తృతంగా చర్చించారు.
మూసీ సుందరీకరణ పేరుతో జనాన్ని మోసం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, సీఎం ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. మూసీ పరివాహక ప్రాంతంలో కొలువు తీరిన స్థానికులు ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని సూచించారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సర్కార్ ను, సీఎంను ఏకి పారేయాలని సూచించారు. ఇదే సమయంలో మూసీ ప్రాజెక్టు సుందరీకరణ వల్ల ఎవరికి లాభమో, ఎవరికి నష్టం జరుగుతుందో కూడా వివరించే ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు కేటీఆర్.