తమిళనాడులో మహీంద్రా పెట్టుబడి
రూ. 1,000 కోట్ల దాకా ఇన్వెస్ట్ మెంట్
తమిళనాడు – ప్రముఖ వ్యాపార సంస్థ మహీంద్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కీలక ప్రకటన చేసింది. తమిళనాడులో రూ. 1,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. మహీంద్రా గ్రూప్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వ్యాపార విస్తరణ కోసం తమిళనాడులో గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇదే విషయం గురించి శుక్రవారం కీలక వివరాలు తెలియ చేసింది మహీంద్రా కంపెనీ.
మహీంద్రా హాలిడేస్ ద్వారా మూడు కొత్త రిసార్ట్‌లలో రూ. 800 కోట్లు, మహీంద్రా లైఫ్ స్పేసెస్ డెవలపర్స్ ఇండస్ట్రియల్ పార్క్ విస్తరణ కోసం అదనంగా రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ , మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా సమక్షంలో ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.
రాబోయే రోజుల్లో వివిధ రంగాలలో కూడా ఇన్వెస్ట్ చేసే విషయంపై ఆలోచిస్తున్నట్లు తెలిపింది. భారీగా పెట్టుబడులు పెట్టడం వల్ల వందలాది మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొంది.