కేటీఆర్ కామెంట్స్ సీతక్క కౌంటర్
మీరు చేసిన అప్పుల కోసమే ఈ తిప్పలు
హైదరాబాద్ – తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ అప్పుల కుప్పగా మార్చేసిందంటూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు రాష్ట్ర మంత్రి దాసరి సీతక్క. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు . స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తొమ్మిదన్నరేళ్లలో మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని, దీనికి ఎవరు కారణమో చెప్పాలన్నారు. అప్పుల వారసత్వానికి ఆద్యులు మీరు కాదా అంటూ మండిపడ్డారు సీతక్క.
మీ హయాంలో అక్షరాల రూ. 7 లక్షల కోట్ల అప్పులు చేశారని, వాటికి కిస్తీలు, వడ్డీల కోసం ప్రతి రోజు రూ. 207 కోట్లు చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. అంటే ప్రతి నెల సగటున 6 వేల కోట్ల ప్రజాధనాన్ని మీ అప్పుల కుప్పను కడగడానికే సరిపోతుందని అన్నారు సీతక్క.
అప్పుల అప్పారావు లాగా అందిన కాడల్లా అప్పులు చేసి.. రాష్ట్రాన్ని తిప్పలు పెట్టి, వడ్డీలతో ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచిన మిమ్మల్ని దేనితో కొట్టాలో చెప్పాలని అన్నారు.
అప్పులు చాలవన్నట్లు వేల కోట్ల బకాయిలను మీరు చెల్లించ లేదన్నారు మంత్రి. చేసిన పనులకూ బిల్లులు చెల్లించ లేదని ఆరోపించారు. 5 వేల కోట్ల ఫీ రియంబర్స్ మెంట్ బకాయిలు, ఆరోగ్య శ్రీ బకాయిలు, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు, సర్పంచులకు పెండింగ్ బకాయిలు, విద్యుత్ సంస్దలకు బకాయిలు, ఆర్టీసీకి బకాయిలు, గురుకుల భవనాల ఓనర్లకు అద్దె బకాయిలు, ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధుల పెండింగ్..ఇలా ప్రతి శాఖలో వందల కోట్ల బకాయిలు పెట్టి…ఇప్పుడు బుకాయిస్తే ఎలా అని నిలదీశారు సీతక్క .
మీ నిర్వాకంతో గాడి తప్పిన ఆర్దిక వ్యవస్థను గాడిలో పెడుతూ..ఈ పది నెలల కాలంలో 18 వేల కోట్ల పంట రుణాలను ప్రజా ప్రభుత్వం మాఫి చేసిందన్నారు . మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళల వంటింటి భారం దించేందుకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్, సామాన్యులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తి చేసింది ప్రజా ప్రభుత్వమని తెలిపారు.