సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రెస్ జీరో
10 నెలలు 25 సార్లు హస్తినకు
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలో ముఖ్యమంత్రి ఏకంగా 25 సార్లు ఢిల్లీకి వెళ్లారని, 50 రోజులు తన ప్రయాణానికే కేటాయించారని పేర్కొన్నారు.
గురువారం ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. దీని వల్ల ప్రజా ధనం ఖర్చు కావడం తప్ప ఒక్క పైసా వచ్చిన దాఖలాలు లేవన్నారు. పోనీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తీసుకు వచ్చారా అంటే అదీ లేదన్నారు.
మొత్తం ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం పేరుతో ఏకంగా రూ. 80,500 కోట్లు అప్పులు చేశాడని, ఆ డబ్బులు ఎవరి కోసం ఖర్చు చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పైసా పని లేదు..దమ్మడి ఆదాయం లేదన్నారు.
ఢిల్లీలో హైకమాండ్ ప్రసన్నం చేసుకునేందుకే సమయం సరి పోవడం లేదన్నారు. నోరు పారేసు కోవడం తప్ప రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు. అన్నదాతల అరిగోసలు, గాల్లో దీపాల్లా గురుకులాలు, కుంటు పడిన వైద్యం, గాడి తప్పిన విద్యా వ్యవస్థ, మూసీ పేరుతో మోసం, హైడ్రా పేరుతో దౌర్జన్యం ఇదీ రేవంత్ రెడ్డి ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.