NEWSTELANGANA

సెక్ష‌న్ 196 దుర్వినియోగం త‌గదు – ఆర్ఎస్పీ

Share it with your family & friends

తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం

హైద‌రాబాద్ – బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కావాల‌ని ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జాస్వామిక వాదుల‌పై క‌క్ష సాధింపు ధోర‌ణి అవ‌లంభిస్తోంద‌ని ఆరోపించారు. గురువారం ఎక్స్ వేదిక‌గా ఆర్ఎస్పీ స్పందించారు. ఆయ‌న పోలీసులు అనుస‌రిస్తున్న విధానం బాగో లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌నం నేర్చుకున్న‌ది ఏమిటి..చేస్తున్న ప‌నేంటి అంటూ ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్బంగా పోలీస్ అకాడ‌మీల‌కు తిరిగి వెళ్లి మ‌ళ్లీ లా నేర్చు కోవాల‌ని తాను స‌ల‌హా ఇస్తున్నాన‌ని అన్నారు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. బార‌తీయ న్యాయ స‌హింత – 2023 పేరుతో ప్ర‌తిప‌క్ష పార్టీలు, ప్ర‌జాస్వామ్య స్వ‌రం వినిపించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్న వారిపై కావాల‌ని సెక్ష‌న్ 196ని న‌మోదు చేస్తున్నార‌ని , గుడ్డిగా ఆశ్ర‌యించ‌డం దారుణ‌మ‌ని ఆరోపించారు.

భారత రాజ్యాంగం ప్రకారం ప్రజా విధానంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికి ఉందనే విష‌యం మ‌రిచి పోతే ఎలా అని నిల‌దీశారు ఆర్ఎస్పీ. ఇందులో రాజ్యాంగం ప్రకారం ఈసీఐలో నమోదైన రాజకీయ పార్టీలు కూడా ఉన్నాయ‌ని తెలిపారు.

మతం, జాతి, జన్మ స్థలం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం , సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలను ప్ర‌శ్నించ‌డం ప్రభుత్వ విధానాన్ని లేదా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం ఎలా అవుతుందని అన్నారు ఆర్ఎస్పీ.