ఇసుక మాఫిమా జోరు జనం బేజారు
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇసుకాసురులు రెచ్చి పోతున్నారని, వారిపై ఆజమాయిషీ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పాలనలో శాండ్ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు కేటీఆర్. గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విచ్చల విడిగా ఇసుక దందాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు .
బడా చోటా అన్నది తేడా లేనే లేదన్నారు. మంత్రుల నుంచి మండల స్థాయి, గల్లీ స్థాయి లీడర్ల దాకా ఇసుకను అడ్డం పెట్టుకుని అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు కేటీఆర్. అధికారులను మ్యానేజ్ చేస్తూ , తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇసుక మాఫియాకు తెర తీశారంటూ వాపోయారు.
నదులను..వాగులను…వంకలను కొల్లగొట్టి ఖజానాకు చేరాల్సిన సొమ్మును కాంగ్రెస్ వాళ్ల జేబుల్లో నింపుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్.
అధికార పార్టీ నేతల అండదండలతో అనధికార తవ్వకాలతో యథేచ్ఛగా అడ్డూ అదుపూలేని ఇసుక దోపిడి సాగుతున్నదని, దీనిని వెంటనే అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.