కీవీస్ దెబ్బ భారత్ అబ్బా
46 పరుగులకే ఆలౌట్
బెంగళూరు – బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు 2వ రోజులో ఊహించని రీతిలో భారత జట్టుకు బిగ్ షాక్ తగిలింది. కీవీస్ బౌలర్ల దెబ్బకు టాప్ ఆటగాళ్లు విలవిల లాడారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇలా ప్రతి ఒక్కరూ పెవిలియన్ బాట పట్టారు.
ఏకంగా భారత జట్టులో అయిదుగురు క్రికెటర్లు డకౌట్ (0) అయ్యారు. తొలి రోజు భారీ వర్షం కారణంగా ఆటకు అంతరాయం కలిగింది. దీంతో 2వ రోజు ఆట ప్రారంభం అయిన వెంటనే కీవీస్ బౌలర్లు చుక్కలు చూపించారు. బంతుల్ని మిస్సైల్స్ కంటే వేగంగా వేయడంతో మనోళ్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డారు.
కేవలం 46 పరుగులకే చాప చుట్టేసింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్ లో అత్యల్ప స్కోర్ కే పరిమితం కావడం ఫ్యాన్స్ ను విస్తు పోయేలా చేసింది. న్యూజిలాండ్ జట్టులో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు తీస్తే, రౌర్కీ 4 వికెట్లుతో రెచ్చి పోయాడు. భారత్ టాప్ ఆర్డర్ ను కుప్ప కూల్చాడు.
ఇండియన్ స్కిప్పర్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత జట్టులో రిషబ్ పంత్ ఒక్కడే 20 పరుగులు చేశాడు. చేసిన 46 పరుగులలో ఇదే అత్యధిక స్కోర్. ఇక డకౌట్ అయిన బ్యాటర్లలో విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ , జడేజా, కేఎల్ రాహుల్ , రవిచంద్రన్ అశ్విన్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగారు. ఇక ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్లు కోల్పోయి 180 రన్స్ చేసింది.