NEWSTELANGANA

సీఎం కామెంట్స్ దాసోజు సీరియ‌స్

Share it with your family & friends

మ‌హిళ‌లంటే ఎందుకంత చిన్న చూపు
హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. మూసీ ప్రాజెక్టు సుంద‌రీక‌ర‌ణ‌కు సంబంధించి మాట్లాడ‌కుండా , తాను ఏం చేయ‌ద‌ల్చుకున్నాడో స్ప‌ష్టం చేయ‌కుండా సొల్లు క‌బుర్లు చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు.

విచిత్రం ఏమిటంటే ఒక బాధ్య‌త క‌లిగిన ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి మ‌హిళ‌ల ప‌ట్ల చుల‌క‌న భావాన్ని క‌లిగి ఉండ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. నాలుగున్న‌ర కోట్ల మందికి ఆద‌ర్శ ప్రాయంగా నిల‌వాల్సిన సీఎం మ‌రింత దిగ‌జారుడు కామెంట్స్ చేయ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్.

తాను చేపడుతున్న మూసీ ప్రాజెక్ట్ గురించి సమర్థమైన వివరణ ఇవ్వకుండా “అందాలు, అందాల భామలు” అంటూ అసంబద్ధమైన అర్ధంపర్ధం లేని మురికి మాటలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి తన అహంకారంతో చిల్లర పైత్యాన్ని ఎంత దూరం తీసుకెళ్లారో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు .

మహిళలు అందంగా ఉంటే నేరమా? మహిళల పట్ల ఏహ్యభావం, చిన్నచూపు ఎందుకు అని నిల‌దీశారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్. అందంగా ఉన్న మహిళలు ప్రభుత్వంతో కలిసి ప్రజల కోసం పని చేయకూడ‌ద‌ని ఏమైనా రూల్ ఉందా అని ప్ర‌శ్నించారు.

సోనియా, ప్రియాంక‌, దీపా దాస్ మున్షీ లాంటి అగ్ర నేత‌లు క‌లిగిన కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి నీచ‌మైన మాట‌లు మాట్లాడ‌టం స‌బ‌బు కాద‌న్నారు.