NEWSTELANGANA

స‌ర్కార్ నిర్వాకం హ‌రీశ్ ఆగ్ర‌హం

Share it with your family & friends

ఉద్యోగుల డీఏ మాటేమిటి

హైద‌రాబాద్ – రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాలు అస్త‌వ్య‌స్తంగా ఉన్నాయ‌ని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఆయ‌న శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ప్ర‌ధానంగా ఆయ‌న ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు దీపావ‌ళి పండుగ కానుక‌గా 3 శాతం క‌రువు భ‌త్యం (డీఏ) ప్ర‌క‌టించింద‌ని గుర్తు చేశారు.

కానీ ఇదే స‌మ‌యంలో తాజాగా జ‌రిగిన శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు ఎందుకు అమ‌లు చేయ‌డం లేద‌ని , దీనికి గ‌ల కార‌ణాలు ఏమిటో చెప్పాల‌ని హ‌రీశ్ రావు త‌న్నీరు డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ అభయ హస్తం మేనిఫెస్టోలో ప్రభుత్వ ఉద్యోగులందరికి ఆనాటికి పెండింగ్ లో ఉన్న3 డీఏలను అధికారంలోకి రాగానే తక్షణమే చెల్లిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్లకు ఇచ్చే డీఏలను సకాలంలో ప్రకటించి, బకాయిలను నేరుగా ఉద్యోగస్థులకు చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

పార్లమెంట్ ఎన్నికల వేళ ఎంసీహెచ్ఆర్డీలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలతో సమావేశమై మరుసటి రోజే క్యాబినెట్ లో చర్చించి డీఏలు వెనువెంటనే విడుదల చేస్తామని మరోసారి హామి ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు.

మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు పూర్త‌యినా ఇప్ప‌టి వ‌ర‌కు 5 డీఏలుఉపాధ్యాయ, ఉద్యోగ, పింఛనర్లకు ప్రభుత్వం బకాయి పడిందన్నారు. డీఏలు విడుదల చేయక పోవడం వల్ల ఒక్కో ఉద్యోగి నెలకు సుమారు రూ.5000 నుంచి రూ.20,000 వరకు నష్టపోవాల్సి వస్తుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు త‌న్నీరు హ‌రీశ్ రావు.

బకాయి పడ్డ 5డీఏల మొత్తం 17.29 శాతం గురించి ఈనెల 23న జరిగే క్యాబినెట్ సమావేశంలో చర్చించి, దీపావళి కానుకగా బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామ‌ని అన్నారు.