గ్రూప్ -1 అభ్యర్థులకు టీపీసీసీ చీఫ్ భరోసా
తమకు న్యాయం చేయాలని విన్నపం
హైదరాబాద్ – తమకు న్యాయం చేయాలని కోరుతూ గ్రూప్ -1 మెయిన్స్ అభ్యర్థులు, విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో కలుసుకున్నారు. ఈ సందర్బంగా తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పరీక్షల షెడ్యూల్ ను మార్చాలని, జీవోల ప్రభావం గురించి ప్రత్యేకంగా విన్నవించారు. రాష్ట్ర సర్కార్ తమ ఇబ్బందుల గురించి పట్టించు కోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బాధిత అభ్యర్థులు.
గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్‌ల జాప్యం, పేపర్ లీకేజీల కారణంగా ఆశావహులు ఇప్పటికే నష్ట పోయారని, ఇది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపిందని తాను అర్థం చేసుకున్నానని ఈ సందర్బంగా పేర్కొన్నారు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.
అయితే గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను పారదర్శకంగా, న్యాయబద్ధంగా రిక్రూట్‌మెంట్ ప్రక్రియ జరిగేలా చూస్తానని, ఈ విషయం గురించి తాను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో కలిసి చర్చిస్తానని , మీ అందరికీ అన్యాయం జరగకుండా చేస్తానని హామీ ఇచ్చారు నిరుద్యోగులకు.
ఎవరూ ఆందోళనకు గురి కావద్దని సూచించారు టీపీసీసీ చీఫ్. అందరికీ న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.