వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
సర్వాలంకార భూషితుడైన స్వామి
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భావించే తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కళ కళ లాడుతోంది. ఎక్కడ చూసినా గోవింద నామ జపమే వినిపిస్తోంది. తిరుమలలో రాత్రి పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు.
గరుడ వాహనం సర్వ పాప ప్రాయశ్చిత్తంగా భావిస్తారు భక్తులు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడ సేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియ జెబుతారు. అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వ పాపాలు తొలగుతాయని భక్త కోటికి తెలియ జెబుతున్నాడు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ సీవీఎస్వో శ్రీధర్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, డిప్యూటీ ఈఓ భాస్కర్, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.