గౌతమ్ అదానీ రూ. 100 కోట్ల విరాళం
యంగ్ ఇండియా యూనివర్శిటీ కోసం
హైదరాబాద్ – అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్, అదానీ ఫౌండేషన్ చైర్మన్ గౌతమ్ అదానీ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ కోసం తమ ఫౌండేషన్ తరపున ఏకంగా రూ. 100 కోట్ల విరాళం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్ కు విచ్చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
రూ. 100 కోట్ల భారీ విరాళాన్ని సర్కార్ తలపెట్టిన యూనివర్శిటీ అభివృద్ది కోసం తాము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వీటిని అందజేస్తున్నట్లు స్పష్టం చేశారు గౌతమ్ అదానీ. తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త యూనివర్శిటీని ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీకి గౌరవ చైర్మన్ గా ప్రముఖ వ్యాపారవేత్త , మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను నియమించారు. ఆయన కూడా ఇందుకు ఒప్పుకున్నారు. ప్రస్తుతం దీనిని ఇండియాలోనే అద్భుతమైన యూనివర్శిటీగా తీర్చి దిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు సీఎం.
మరో వైపు అదానీ ఇంత భారీ ఎత్తున విరాళాన్ని ఇవ్వడం విశేషం. ఇంకో వైపు రాహుల్ గాంధీ పదే పదే అదానీ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరో వైపు రేవంత్ రెడ్డి అదానీతో దోస్తీ కట్టడం విస్తు పోయేలా చేసింది.