గ్రంథాలయ నిర్వహణపై లోకేష్ ఫైర్
విశాఖ లైబ్రరీ ఆకస్మిక తనిఖీ
విశాఖపట్నం – ఏపీ విద్యా, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సీరియస్ అయ్యారు. శనివారం ఆయన విశాఖ నగరంలోని నెహ్రూ బజార్ లో ఉన్న ప్రాంతీయ గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన తనిఖీ చేసే సమయంలో లైబ్రరీ మూసి ఉండడాన్ని గమనించారు. ఉదయం 9.45 గంటలైనా ఇంకా గ్రంథాలయాన్ని మూసి ఉంచడంపై సీరియస్ అయ్యారు. వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
ఉదయం 8 గంటలకు తెరవాల్సిన లైబ్రరీని… 9.45 గంటలకు కూడా మూసి ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు నారా లోకేష్. గ్రంథాలయాల అస్తవ్యస్త నిర్వహణ, సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిక్ లైబ్రరీల పర్యవేక్షణకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించాలని ఆదేశించారు.
విద్యార్థులు, నిరుద్యోగులు కాంపిటీటివ్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశం లోనే బెస్ట్ మోడల్ ను అధ్యయనం చేసి రాష్ట్రంలో పబ్లిక్ లైబ్రరీల వ్యవస్థను బలోపేతం చేయాలని స్పష్టం చేశారు నారా లోకేష్. ప్రస్తుతానికి క్షమిస్తున్నానని, ఇంకోసారి ఇలాగే కొనసాగితే ఊరుకునేది లేదని కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు విద్యా శాఖ మంత్రి.