NEWSANDHRA PRADESH

గాడి త‌ప్పిన పాల‌న ప్ర‌జ‌ల ఆవేద‌న – జ‌గ‌న్

Share it with your family & friends

అన్ని వ్య‌వ‌స్థ‌లు నిర్వీర్యం..కూట‌మి వైఫ‌ల్యం

అమ‌రావ‌తి – వైసీపీ బాస్, మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. శ‌నివారం ట్విట్ట‌ర్ ఎక్స్ వేదికగా స్పందించారు. కూట‌మి స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టారు. ప్ర‌చారం త‌ప్పా ప‌ని చేసింది ఏమీ లేద‌న్నారు.

రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలి పోయిందనడానికి విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ప్రబలిన అతిసార ఘటనలే ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. 11 మంది చనిపోయినా, వందల సంఖ్యలో బాధితులున్నా చంద్రబాబు ప్రభుత్వం నిద్ర వీడడం లేద‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్ రెడ్డి.

సమీపంలోనే ఉన్న విజయనగరం, విశాఖపట్నంల్లో మంచి ఆస్పత్రులు ఉన్నా స్థానిక పాఠశాలలోని బెంచీలమీద చికిత్స అందించడం దారుణమ‌ని, నాణ్యమైన అత్యవసర వైద్యాన్ని అందించడంలో ప్రభుత్వం విఫలమైంద‌ని ఫైర్ అయ్యారు మాజీ సీఎం .

లిక్కర్‌, ఇసుక స్కాంల్లో నిండా మునిగి పోయిన ప్రభుత్వ పెద్దలు ప్రజల కష్టాలను గాలికి వ‌దిలేశారని మండిప‌డ్డారు. ఇప్పటికే 104, 108 వ్యవస్థలు దెబ్బతిన్నాయ‌ని అన్నారు. బాబు వచ్చాక వీరికి సరిగా జీతాలు కూడా రావడం లేద‌ని వాపోయారు జ‌గ‌న్ రెడ్డి.

ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయి పోయింద‌ని, దాదాపు రూ.1800 కోట్ల బకాయిలు గత మార్చి నుంచి పెండింగ్‌లో పెట్టారని ఆరోపించారు. ఆరోగ్య ఆసరాను పూర్తిగా ఎత్తి వేశార‌ని అన్నారు. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడార‌ని నిప్పులు చెరిగారు.

పీహెచ్‌సీల్లో స్పెషలిస్టు డాక్టర్లను తీసివేశారు. విలేజ్ క్లినిక్స్‌, పీహెచ్‌సీలను నిర్వీర్యం చేశారని ఆవేద‌న చెందారు. ఫ్యామిలీ డాక్టర్‌ ఊసే లేదన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో నాడు-నేడు పనులు నిలిచి పోయాయ‌ని, కొత్త మెడికల్‌ కాలేజీలను అస్తవ్యస్తం చేశారని ఆరోపించారు.

ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులు ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నాయ‌ని వాపోయారు.