జీవో 29ను రద్దు చేయండి – హరీశ్ రావు
ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. గత కొన్ని రోజుల నుంచి గ్రూప్ -1 , గ్రూప్స్ అభ్యర్థులు, ఆశావహులు, నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం విదితమే. తాజాగా అశోక్ నగర్ లో శాంతియుతంగా ఆందోళన చేపట్టిన అభ్యర్థులను మహిళలని చూడకుండా పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు తన్నీరు హరీశ్ రావు.
ఈ సందర్బంగా జీవో 29ను వెంటనే రద్దు చేయాలని, అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. జూలై 29న ఇదే అంశానికి సంబంధించి తాను శాసన సభ వేదికగా ప్రభుత్వానికి విన్నవించానని తెలిపారు. అయినా సర్కార్ నిరుద్యోగుల పట్ల వివక్ష పూరితా ధోరణిని అవలంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు తన్నీరు హరీశ్ రావు.
అప్పుడే ఈ ప్రభుత్వం మొండి పట్టు వీడి ఉంటే, భవిష్యత్ ప్రభుత్వ అధికారులయ్యే విద్యార్థులు, అభ్యర్థుల మీద లాఠీలు విరిగేవి కావన్నారు. వారిని అరెస్టులు చేసి పోలీసు స్టేషన్లలో పెట్టే దుస్థితి వచ్చేది కాదన్నారు. వారి బతుకు, భవిష్యత్తు నడిరోడ్డు మీద పడేది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలకు పెను శాపంగా మారిందని వాపోయారు తన్నీరు హరీశ్ రావు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం ద్వారా లభించే హక్కులను, అవకాశాలను జీవోల పేరుతో కాలరాయడం దుర్మార్గం అని పేర్కొన్నారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న విద్యార్థుల పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న కఠిన వైఖరిని చూస్తే ఆవేదన కలుగుతున్నదని పేర్కొన్నారు.
ఇప్పటికైనా కళ్లు తెరిచి గ్రూప్స్ అభ్యర్థుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు . భేషజాలు పక్కన బెట్టి జీవో నెంబర్ 29 ను తక్షణం రద్దు చేసి, గ్రూప్స్ పరీక్షను రీ షెడ్యూల్ చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.