DEVOTIONAL

పోలీసుల లాఠీ ఛార్జీపై ఈట‌ల క‌న్నెర్ర‌

Share it with your family & friends

కాంగ్రెస్ స‌ర్కార్ నిర్వాకంపై ఆగ్ర‌హం

సికింద్రాబాద్ – మ‌ల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను త‌ప్పు ప‌ట్టారు. శాంతియుతంగా ఆందోళ‌న చేప‌ట్టిన హిందూ భ‌క్తుల‌పై పోలీసులు లాఠీ ఛార్జి జ‌ర‌ప‌డాన్ని తీవ్రంగా నిర‌సించారు. ఇది పూర్తిగా అరాచ‌క‌మ‌ని, గాడి త‌ప్పిన పాల‌న‌కు నిద‌ర్శ‌న‌మ‌ని మండిప‌డ్డారు ఈటల రాజేంద‌ర్.

శ‌నివారం సికింద్రాబాద్ కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయం వద్ద హిందూ భక్తులు పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా అమ్మ వారి విగ్ర‌హాన్ని ధ్వంసం చేసిన వారు ఎవ‌రో చెప్ప‌కుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ ప్ర‌శ్నించారు బీజేపీ ఎంపీ. కాంగ్రెస్ ప్ర‌భుత్వం కావాల‌ని ఎవ‌రో చెప్ప‌డం లేద‌ని ఆరోపించారు.

హిందూ భ‌క్తుల‌పై లాఠీ ఛార్జి జ‌రిపిన పోలీసుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, భక్తుల రక్తం కళ్ళచూసిన పాపం ఊరికే పోదన్నారు. అమ్మ వారిని కాళ్ళతో తన్ని అవమానించిన వ్యక్తి వెనుక ఉన్నది ఎవరో ఇప్పటి వరకు ఎందుకు ప్ర‌కటించ లేదంటూ ప్ర‌శ్నించారు ఈట‌ల రాజేంద‌ర్.

వివిధ రాష్ట్రాల నుండి రెండు వందల మంది సికింద్రాబాద్ మెట్రో పోలీస్ హోటల్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే సమావేశం పెట్టుకున్నారని తెలిసినా ఎందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నారని నిల‌దీశారు ఎంపీ.

మీ చిల్లర రాజకీయాల కోసం తాత్సారం చేస్తే.. బలయ్యేది అమాయక ప్రజలు, మూల్యం చెల్లించాల్సింది మీ ప్రభుత్వమే అని మరోసారి హెచ్చరిస్తున్నాన‌ని అన్నారు.