ముత్యాలమ్మ కోసం భక్తుల ఆందోళన
ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో
సికింద్రాబాద్ – సికింద్రాబాద్ లోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ దేవాలయం లో అమ్మ వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ శనివారం హిందూ బంధువులు, భక్తులు భారీ ఎత్తున ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి విషమించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. లాఠీ ఛార్జి చేయడంతో చెల్లా చెదురయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా తప్పు తప్పు పట్టారు హిందూ భక్తులు. శాంతియుతంగా ఆందోళన చేపట్టిన తమపై పోలీసులు లాఠీ ఛార్జి జరపడాన్ని తీవ్రంగా నిరసించారు. ఇది పూర్తిగా అరాచకమని, గాడి తప్పిన పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
దేవాలయం వద్ద హిందూ భక్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా అమ్మ వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారు ఎవరో చెప్పకుండా ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ ప్రశ్నించారు బీజేపీ ఎంపీ. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఎవరో చెప్పడం లేదని ఆరోపించారు.
తమపై లాఠీ ఛార్జి జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, తమ రక్తం కళ్ళచూసిన పాపం ఊరికే పోదన్నారు. అమ్మ వారిని కాళ్ళతో తన్ని అవమానించిన వ్యక్తి వెనుక ఉన్నది ఎవరో ఇప్పటి వరకు ఎందుకు ప్రకటించ లేదంటూ ప్రశ్నించారు ఈటల రాజేందర్.
వివిధ రాష్ట్రాల నుండి రెండు వందల మంది సికింద్రాబాద్ మెట్రో పోలీస్ హోటల్ లో మత విద్వేషాలు రెచ్చగొట్టే సమావేశం పెట్టుకున్నారని తెలిసినా ఎందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు.
మీ చిల్లర రాజకీయాల కోసం తాత్సారం చేస్తే.. బలయ్యేది అమాయక ప్రజలు, మూల్యం చెల్లించాల్సింది మీ ప్రభుత్వమే అని మరోసారి హెచ్చరిస్తున్నానని అన్నారు.