అభివృద్ది పేరుతో ఇళ్లు కూల్చేస్తారా ..?
కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి
హైదరాబాద్ – కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన హైదరాబాద్ లోని డివిజన్ కేసరినగర్ ను సందర్శించారు. ఈ సందర్బంగా అక్కడ నివసిస్తున్న వారితో మాట్లాడారు. వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మీ వద్దకు రారని, వస్తే తన పేరు చెప్పాలని అన్నారు కేంద్ర మంత్రి.
మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇళ్లను కూల్చి వేస్తామని ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు గంగాపురం కిషన్ రెడ్డి. తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎలాగైనా అడ్డుకుని తీరుతామని ప్రకటించారు.
మూసీ సుందరీకరణగా రూపొందించబడిన కూల్చివేతకు వారి సమర్థన, వారి ఏకపక్ష చర్యలకు సాకు మాత్రమేనంటూ మండిపడ్డారు. ఈ ఇళ్ళు దశాబ్దాలుగా ఇక్కడ ఉన్నాయని అన్నారు కిషన్ రెడ్డి; వాటిని నాశనం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం హఠాత్తుగా నిర్ణయించు కోవడం దారుణమన్నారు.
ఇలాంటి క్రూరమైన ప్రజావ్యతిరేక చర్యలను అమలు చేయడాన్ని బిజెపి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించదని స్పష్టం చేశారు గంగాపురం కిషన్ రెడ్డి. తన ప్రాణాలను పణంగా పెట్టయినా సరే తాను అడ్డుకుంటానని ప్రకటించారు.