ఎప్పుడైనా నేను పీడితుల పక్షమే
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటన
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన తన లక్ష్యం ఏమిటో స్పష్టం చేశారు. వృత్తి పరంగా ఖాకీగా ఉన్నా ప్రవృత్తి పరంగా రాజకీయ రంగంలోకి వచ్చినా ఎక్కడా విలువలను కోల్పోదేని పేర్కొన్నారు ఆర్ఎస్పీ.
నాడైనా నేడైనా ఎప్పుడైనా తాను పీడిత ప్రజల పక్షమేనని కుండ బద్దలు కొట్టారు. తాజాగా రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఇచ్చిన హామీల ఊసే లేదని పేర్కొన్నారు.
ఇదే సమయంలో ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో తాత్సారం వహించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. 2 లక్షల జాబ్స్ భర్తీ మాటేమిటి అని ప్రశ్నించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ఆశావహులు శాంతియుతంగా ఆందోళన చేపట్టినా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, మహిళలని చూడకుండా దాడికి పాల్పడడం దారుణమన్నారు.
అకారణంగా కేసులు నమోదు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. భారత రాజ్యాంగ స్పూర్తి ప్రదాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం సాక్షిగా పేదలు, సామాన్యులు, బడుగు , బలహీన వర్గాల ప్రజల పట్ల రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్న విధానం పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉందని మండిపడ్డారు.