వీఐపీ దర్శన టికెట్లు అమ్ముకున్న ఎమ్మెల్సీ
కేసు నమోదు చేసిన టీటీడీ విజిలెన్స్
తిరుమల – తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కు సంబంధించి జారీ చేసే వీఐపీ దర్శన టికెట్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. తాజాగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల పూర్తిగా పక్కదారి పట్టిందనే విమర్శలు లేక పోలేదు. ఇందుకు నిదర్శనంగా మరో టికెట్ల కొనుగోలు బాగోతం బట్ట బయలు కావడం విస్తు పోయేలా చేసింది.
ఇప్పటికే తిరుపతి లడ్డూ కల్తీ వివాదం దేశ వ్యాప్తంగా హల్ చల్ చేసింది. సాక్షాత్తు సీఎం నారా చంద్రబాబు నాయుడే సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై సిట్ విచారణకు ఆదేశించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది సుప్రీంకోర్టు. సీబీఐతో ఎంక్వయిరీ చేయాలని ఆదేశించింది. ఈ సందర్బంగా దేవుళ్లను రాజకీయాల్లోకి లాగొద్దంటూ చురకలు అంటించింది.
ఇదిలా ఉండగా మరో బాగోతం బయట పడింది. అదేమిటంటే ఏకంగా వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ జకియా ఖానం సిఫారసు మేరకు 6 వీఐపీ టికెట్లు పొందారు. ఆ ఆరు టికెట్లను రూ. 65 వేల రూపాయలకు అమ్ముకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
అధిక ధరకు అమ్ముకున్న ఎమ్మెల్సీపై టీటీడీ అధికారులకు భక్తుడు ఫిర్యాదు చేయడంతో అసలు వాస్తవం ఏమిటో బయట పడింది. దీంతో విచారణకు ఆదేశించారు ఈవో. ఈ మేరకు విచారణ చేపట్టింది టీటీడీ విజిలెన్స్ వింగ్ . విచారణలో టికెట్లు అమ్ముకున్నది వాస్తవమేనని తేలింది. దీంతో ఏ1గా చంద్రశేఖర్, ఏ2గా ఎమ్మెల్సీ జకియా ఖానం, ఏ3గా ఎమ్మెల్సీ పీఆర్ఓ కృష్ణ తేజ పేర్లు చేర్చారు పోలీసులు.