ఏపీలో లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్
నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్
అమరావతి – మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన కూటమి సర్కార్ ను ఏకి పారేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముప్పు ఏర్పడిందన్నారు. మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందరాని సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ వేదికగా సీరియస్ కామెంట్స్ చేశారు జగన్ రెడ్డి.
ప్రతిరోజూ ఏదో ఒకచోట అ త్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలుపోసి, నిప్పుపెట్టి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గమన్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తున్నానని పేర్కొన్నారు. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉందన్నారు. ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం.
చంద్రబాబు తమ మీద కక్షకొద్దీ తాము అమలు చేసిన పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రం మీద, ప్రజల మీద కక్షసాధిస్తున్నారని ఆరోపించారు జగన్ రెడ్డి . ఇది అన్యాయంకాదా? వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక “దిశ’’ కార్యక్రమాన్ని ఉద్దేశ పూర్వకంగా నీరు గార్చడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
దిశ కార్యక్రమాన్ని బలోపేతంచేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబులు ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించామని తెలిపారు.. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను “దిశ’’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచామని స్పష్టం చేశారు జగన్ రెడ్డి.
18 “దిశ’’ పోలీస్‌స్టేషన్లను పెట్టి, 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చామని, వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశామన్నారు. వీటన్నింటినీ నిర్వీర్యం చేసి ఏం సాధించాలని అనుకుంటున్నారంటూ బాబుపై భగ్గుమన్నారు.