ఢిల్లీ కాలుష్యానికి హర్యానా కారణం
ఆప్ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్
ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో నీరు, వాయు కాలుష్యానికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని హర్యానానేనని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి అనారోగ్యానికి పూర్తి బాధ్యత ఆ రాష్ట్ర సర్కార్ తో పాటు దేశంలో కొలువు తీరిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు సంజయ్ ఆజాద్ సింగ్.
ఆయన చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కాలుష్యానికి కాషాయమే కారణమని పేర్కొనడం విస్తు పోయేలా చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ వాసులను ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఒక రకంగా పీఎంను ఎక్స్ వేదికగా నిలదీశారు ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్.
అసలు ఢిల్లీ ప్రజలు ఏం నేరం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు . ఢిల్లీని నాశనం చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుందని ఆవేదన వ్యక్తం చేశారు ఆప్ ఎంపీ. ఈ దేశంలో తాము మాత్రమే అధికారంలో ఉండాలని అనుకోవడం దారుణమన్నారు. ఇది ప్రజలు సహించరని, ప్రజాస్వామ్యంలో ఇది నడవదని హెచ్చరించారు. ఏదో ఒక రోజు ఢిల్లీ వాసులు తగిన రీతిలో బుద్ది చెప్పడం తప్పదన్నారు.