26 నుండి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం
ప్రకటించిన ఏపీ మంత్రి కందుల దుర్గేష్
అమరావతి – పర్యాటకులకు శుభవార్త చెప్పింది ఏపీ కూటమి సర్కార్. ఈనెల 26 నుండి ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు ఏపీ మంత్రి కందుల దుర్గేష్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వారాంతంలో ప్రముఖ అధ్యాత్మిక దేవాలయాలు, పంచారామ క్షేత్రాలు సందర్శించేలా ఒక రోజు టూర్ ప్యాకేజీకి పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తుందని వెల్లడించారు మంత్రి. అసెంబ్లీలో శాసనసభ్యుల సూచనల మేరకు ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు .
ఆదివారం కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. ఆధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశామన్నారు. కోరుకొండ, అన్నవరం, పిఠాపురం, సామర్లకోట, ద్రాక్షారామం, వాడపల్లి ఆలయాలను కలుపుతూ ప్రతి శనివారం అందుబాటులో బస్సులు ఉంచనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో పర్యాటకుల రద్దీ, డిమాండ్ దృష్ట్యా ఆదివారం కూడా బస్సులు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామన్నారు.
రాజ మహేంద్రవరం సరస్వతీ ఘాట్ వద్ద టూరిజం శాఖకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ రిజర్వేషన్ కౌంటర్ కార్యాలయం (ఐఆర్ఓ) వద్ద ఉదయం 6 గం.లకు బస్సులు ప్రారంభిస్తామన్నారు. రాత్రి 7.30 కి ప్రయాణం జరగనుందని పేర్కొన్నారు కందుల దుర్గేష్.
పెద్దలకు రూ.1,000, 3-10 ఏళ్ల వయస్సు గల చిన్నారులకు రూ. 800 టికెట్ నిర్ణయించినట్లు తెలిపారు. ప్రకృతి రమణీయత, అధ్యాత్మిక కలయికగా ఉన్న టూర్ ప్యాకేజీని యాత్రికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.