31న ఆర్జిత సేవలు రద్దు – టీటీడీ
శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
తిరుమల – కోరిన కోర్కెలు తీర్చే తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా అక్టోబరు 31వ తేదీన ‘దీపావళి ఆస్థానాన్ని’ టీటీడీ శాస్త్రోక్తంగా నిర్వహించనుంది.
దీపావళి నాడు ఉదయం 7 నుండి ఉదయం 9 గంటల వరకు బంగారు వాకిలి ముందు గల ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం జరుగుతుందని తెలిపింది.
ఆస్థానంలో భాగంగా శ్రీ మలయప్ప స్వామి దేవేరులతో కలిసి ఘంటా మండపంలో ఏర్పాటుచేసిన సర్వ భూపాల వాహనంలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వేంచేపు చేస్తారు. సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారిని కూడా స్వామివారి ఎడమ పక్కన మరొక పీఠంపై దక్షిణ ఆభిముఖంగా వేంచేపు చేస్తారు. ఆ తరువాత స్వామి వారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. దీంతో దీపావళి ఆస్థానం పూర్తవుతుందని టీటీడీ స్పష్టం చేసింది.
కాగా సాయంత్రం 5 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని, ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఆర్జిత సేవలు రద్దు – ఈవో జె. శ్యామల రావు
దీపావళి ఆస్థానం కారణంగా అక్టోబరు 31న తిరుప్పావడ, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలను రద్దు చేయడం జరిగిందని వెల్లడించారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.