హామీల జాతర జనానికి పాతర – కేటీఆర్
రైతుబంధు కావాలా..? రాబందు కావాలా..?
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సోమవారం ఎక్స్ వేదికగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్ర స్థాయిలో ఎండగట్టారు. ఎన్నికలకు ముందు అడ్డగోలుగా హామీలు ఇస్తూ పోయారని, చివరకు ఆచరణలోకి వచ్చే సరికల్లా వాటి గురించి ఊసెత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక సీఎం ఎ. రేవంత్ రెడ్డి పిట్టల దొర కంటే దారుణంగా తయారయ్యాడని, తను ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదన్నారు. విచిత్రం ఏమిటంటే ఏ అంశంపైన కూడా తనకు అవగాహన లేదన్నారు. తను నాలుగున్నర కోట్ల ప్రజలకు ప్రతినిధినని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాననే సోయి లేకుండా మాట్లాడటం దారుణమన్నారు కేటీఆర్.
రైతు బంధు ఎగిరి పోయింది..రైతు భరోసా అటకెక్కిందని, రాబంధుల రెక్కల చప్పుడే మిగిలి పోయిందని ధ్వజమెత్తారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి అంటూ ఎద్దేవా చేశారు మాజీ మంత్రి.
ఎకరానికి 15 వేల రూపాయలు ఇస్తామని చెప్పారని, విచిత్రం ఏమిటంటే ఉన్న రూ. 10 వేలు ఊడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. ఇది ప్రజా ప్రభుత్వం కానే కాదని రాబంధుల, రాక్షస పాలన అంటూ ఫైర్ అయ్యారు.