వైఎస్సార్ ఆశయాలకు జగన్ తూట్లు
నిప్పులు చెరిగిన సోదరి వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఎక్స్ వేదికగా సోమవారం మాజీ సీఎం , తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తండ్రి వైఎస్సార్ ఆశయాలకు తూట్లు పొడిచాడని, మోడీకి ఊడిగం చేస్తూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని ఆరోపించారు.
దివంగత వైఎస్సార్ మానస పుత్రిక ఫీజు రీయింబర్స్మెంట్ పథకమని, పేద బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపి, ఎంతో మంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన గొప్ప పథకమని పేర్కొన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
నాడు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని వైఎస్సార్ అద్భుతంగా అమలు చేస్తే.. సొంత కొడుకై ఉండి జగన్ మోహన్ రెడ్డి తన హయాంలో పథకాన్ని నీరు గార్చారని ఆరోపించారు. విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజులు రూ.3500 కోట్లు పెండింగ్ పెట్టడం నిజంగా సిగ్గు చేటు అని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులను మనోవేదనకు గురి చేశారని వాపోయారు షర్మిలా రెడ్డి. దోచుకొని దాచుకోవడం మీద ఉన్న శ్రద్ధ, విద్యార్థుల సంక్షేమం మీద పెట్టలేదన్నారు.
తన తండ్రి జీవితాంతం మతాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారని, కానీ జగన్ రెడ్డి వారికి సలాం చేస్తూ వచ్చాడని ధ్వజమెత్తారు. మోడీకి వారసుడిగా మారిన జగన్ రెడ్డికి తన తండ్రి ఆశయాలు కొనసాగిస్తాడని ఎలా నమ్మగలమని ప్రశ్నించారు. జగన్ లాగా మోసం చేయకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వమైనా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.