సీఎం..రాహుల్ కు కేటీఆర్ సవాల్
దమ్ముంటే అశోక్ నగర్ కు రావాలి
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎంకు సోయి లేదన్నారు. మతి లేకుండా మాట్లాడుతున్నాడని, విప్రో సీఈవో సత్య నాదెళ్ల అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
విషయం తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడటం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. మిడి మిడి జ్ఞానంతో తెలంగాణ పరువు తీస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
బీఆర్ఎస్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని చెప్పడం నిజంగా సిగ్గు చేటు అని అన్నారు. ఇదే అక్టోబర్లో రాహుల్ గాంధీ అశోక్ నగర్ కి వచ్చి ఏడాది లోపు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని , అది వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
నిజంగా దమ్ముంటే రాహుల్ గాంధీ , రేవంత్ రెడ్డి ఇద్దరూ అశోక్ నగర్ కి రావాలని సవాల్ విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
ఇప్పటి వరకు ఎన్ని పోస్టులు భర్తీ చేశారో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు.