కరెంట్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై కన్నెర్ర
తిరస్కరించాలని కోరిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను తిరస్కరించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . సోమవారం మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, తదితరులతో కలిసి హైదరాబాద్ లోని విద్యుత్ నియంత్రణ మండలికి వినతి పత్రం అందజేశారు.
అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ పేర్లు చెప్పి 18,500 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపేందుకు సిద్ధమైందని ఆరోపించారు కేటీఆర్. ఇంత భారీగా ప్రజల పైన విద్యుత్ భారాన్ని మోపడం దారుణం అన్నారు.
ఇప్పటికే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని పారిశ్రామిక రంగం వరకు అన్ని సంక్షోభంలో కూరుకు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్. గృహ వినియోగదారులకు సైతం స్థిర చార్జీల పేరుతో విద్యుత్ భారం మోపేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సిద్దమైందన్నారు.
పారిశ్రామిక రంగానికి సంబంధించి అన్ని కేటగిరీలకు ఒకటే రేటు నిర్ణయించాలని , ట్రూ అప్ ఛార్జీల పేరుతో జనానికి షాక్ ఇవ్వాలని చూస్తోందన్నారు కేటీఆర్. గతంలో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజల పైన విద్యుత్ చార్జీల భారాన్ని వేయ లేదని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అనేక వర్గాలకు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి , అధికారంలోకి వచ్చి ఉన్న విద్యుత్తుని ఊడగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు.