రేవంత్ కామెంట్స్ హరీశ్ సీరియస్
సీఎం తీరు గోబెల్స్ ను మించి పోయింది
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జాబ్స్ విషయంలో చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. మంగళవారం ఆయన ఎక్స్ వేదికగా సీఎంను ఏకి పారేశారు. ఆయనకు సోయి లేకుండా పోయిందన్నారు. జాబ్స్ భర్తీ చేసే విషయంలో పూర్తిగా అబద్దాలు ఆడుతున్నాడని ఆరోపించారు.
ఉద్యోగాల విషయంలో రేవంత్ తీరు 2వ ప్రపంచ యుద్ద సమయంలో హిట్లర్ ప్రచార శాఖ మంత్రిగా పని చేసిన గోబెల్స్ తీరును మించి పోయిందంటూ ఎద్దేవా చేశారు తన్నీరు హరీశ్ రావు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తప్పుడు ప్రకటన చేయడం హాస్యా స్పదంగా ఉందన్నారు .
గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షా 61 వేల పోస్టులు భర్తీ చేసిన మాట వాస్తవం కాదా అన్నారు. దమ్ముంటే భర్తీ చేయలేదని నిరూపించాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఒక్క పోలీసు శాఖలోనే 30,731 కొలువులు నింపామని పేర్కొన్నారు తన్నీరు హరీశ్ రావు.
మరో 16,337 పోస్టులను గుర్తించి, నోటిఫికేషన్ జారీ చేసి, వ్రాత పరీక్ష నిర్వహించి, ఫిజికల్ టెస్టులు నిర్వహించి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసామన్నారు. ఎన్నికల కోడ్.. నియామక పత్రాలు
ఇచ్చేందుకు అడ్డంకిగా మారిందన్నారు. ఆ తర్వాత పవర్ లోకి వచ్చిన నువ్వు తామే భర్తీ చేసినట్లు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఉద్యోగాల గురించి వివరాలు కావాలంటే ఫైనాన్స్ శాఖ నుంచి వివరాలు తెప్పించుకో. అంతేగాని అబద్దాలు ప్రచారం చేస్తూ ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించకు అని హితవు పలికారు తన్నీరు హరీశ్ రావు.