వ్యవసాయ రంగంలో డ్రోన్లది కీలక పాత్ర
మౌలిక వసతుల రంగంలో కూడా
అమరావతి – ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు డ్రోన్ల గురించి. జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ ను ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం అమరావతి డ్రోన్ సదస్సును ఏపీ సీఎం ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రసంగించారు సీఎం.
వ్యవసాయం, మౌలిక వసతుల రంగంలో డ్రోన్లది కీలక పాత్ర అని స్పష్టం చేశారు. నగరాల్లో ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లు వాడవచ్చని పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు.
భవిష్యత్తులో వైద్య రంగంలో పెను మార్పులు రానున్నాయని చెప్పారు. భవిష్యత్తులో రోగులు ఇంటివద్దే ఉండి చికిత్స తీసుకోవచ్చని తెలిపారు. కొన్ని దేశాలు యుద్ధాల్లో డ్రోన్లు వాడుతున్నాయని అన్నారు సీఎం.
కానీ తాము మాత్రం అభివృద్ధి కోసం డ్రోన్లు వాడతామని చెప్పారు. డ్రోన్ల వినియోగంతో రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెడతామని అన్నారు సీఎం. శాంతి భద్రతల పరిరక్షణకు డ్రోన్లు వినియోగిస్తామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.
డ్రోన్లతో నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు వీలవుతుందని చెప్పారు. పోలీసు శాఖలో డ్రోన్ల విస్తృత వినియోగానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి. సాంకేతిక రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని, వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.