NEWSTELANGANA

కాంగ్రెస్ స‌ర్కార్ పై జీవ‌న్ రెడ్డి క‌న్నెర్ర

Share it with your family & friends

ప్ర‌ధాన అనుచ‌రి దారుణ హ‌త్య‌పై ఫైర్

జ‌గిత్యాల జిల్లా – కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌మ ప్ర‌భుత్వంపైనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంగ‌ళ‌వారం త‌న అనుచ‌రుల‌తో క‌లిసి రోడ్డెక్కారు. ఆందోళ‌న చేప‌ట్టారు. ప్ర‌ధానంగా త‌న అనుచ‌రుడు గంగిరెడ్డిని దారుణంగా హ‌త్య చేయ‌డంపై నిప్పులు చెరిగారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వం అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు.

లా అండ్ ఆర్డ‌ర్ ఉందో లేదో అర్థం కావ‌డం లేద‌న్నారు జీవ‌న్ రెడ్డి. మీకో దండం మీ కాంగ్రెస్ పార్టీకో దండం అంటూ మండిప‌డ్డారు. త‌మ మానాన త‌మ‌ను బ‌త‌క‌నీయాల‌ని అన్నారు. త‌న‌ను ప‌రామ‌ర్శించేందుకు వ‌చ్చిన ప్ర‌భుత్వ విప్ అడ్లూరి ల‌క్ష్మ‌ణ్ తో సీరియ‌స్ కామెంట్స్ చేశారు.

ఇదే స‌మ‌యంలో టీపీసీసీ చీఫ్ మ‌హేష్ గౌడ్ ఫోన్ ను క‌ట్ చేశారు ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి. ఏదైనా ఎన్జీఓ పెట్టుకుని ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాన‌ని, తాను ఇక పార్టీలో కొన‌సాగ‌లేన‌ని స్ప‌ష్టం చేశారు . ఇంత కాలం మానసికంగా అవమానాలు త‌ట్టుకుని నిల‌బడ్డామ‌ని, కానీ ఇక నుంచి అలా ఉండ‌లేమ‌న్నారు ఎమ్మెల్సీ.

ఇత‌ర పార్టీల నుంచి వ‌చ్చిన‌ వాళ్ల‌కు ప్ర‌యారిటీ ఇస్తుండ‌డం వ‌ల్ల‌నే కాంగ్రెసోళ్ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని నిప్పులు చెరిగారు జీవ‌న్ రెడ్డి. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.