దిశ యాప్ ను కావాలనే రద్దు చేశారు
వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల
అమరావతి – వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో 19 అవార్డులు తెచ్చుకున్న దిశ యాప్ ను రాజకీయ కక్షతో రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
ఒక్క దిశ యాప్ ద్వారా 31 వేల 600 మంది మహిళలను తమ ప్రభుత్వ హయాంలో రక్షించామని చెప్పారు.
మన రాష్ట్రంలో కోటన్నర మంది మహిళలు దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకున్నారని, దీని వల్ల ఎందరికో భరోసా కలిగిందన్నారు. కానీ కేవలం కక్ష సాధింపు ధోరణితో ఏకపక్షంగా దిశ యాప్ ను రద్దు చేశారని, దీని వల్ల ఇవాళ ఇన్ని అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు శ్యామల.
మహిళలకు, బాలికలకు రక్షణ కల్పించడంలో వైఫల్యం చెందరాని సీఎం చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. ప్రతిరోజూ ఏదో ఒకచోట అత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వ సాధారణమై పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు ధైర్యంగా ఉండాల్సింది పోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు శ్యామల.
దిశ కార్యక్రమాన్ని బలోపేతంచేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబులు జగన్ రెడ్డి ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారని,.. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను “దిశ’’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పర్చడం జరిగిందన్నారు. కానీ కూటమి సర్కార్ దీనిని రద్దు చేయడం దారుణమన్నారు.