వంగవీటి రాధాకు లోకేష్ పరామర్శ
కోలుకుంటున్నానని తెలిపిన రాధా
విజయవాడ – ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై కోలుకుంటున్న మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను తాడేపల్లి ప్రాతూరులోని ఇంటికి వెళ్లి పరామర్శించారు ఏపీ విద్య, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్. మంగళవారం ఆయన స్వయంగా వెళ్లి వంగవీటి రాధాకృష్ణతో పాటు కుటుంబీకులను పరామర్శించారు.
ఈ సందర్బంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో పార్టీలో త్వరలోనే సముచిత స్థానం కల్పిస్తానని కూడా నారా లోకేష్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని పలుమార్లు వంగవీటి రాధాకృష్ణతో భేటీ అయ్యారు. ఆయనను తమ పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించారు. అదే సమయంలో తన తండ్రి, దివంగత నాయకుడు వంగవీటి రాధా విగ్రహాన్ని కూడా ఆవిష్కరించే కార్యక్రమంలో కొడాలి నానితో పాటు వంగవీడి రాధాకృష్ణ పాల్గొన్నారు.
తాజాగా జరిగిన ఎన్నికల్లో ఊహించని రీతిలో వైసీపీ దారుణంగా ఓటమి పాలైంది. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఈ తరుణంలో కూటమి సర్కార్ ఏకంగా 165 సీట్లు చేజిక్కించుకుని విస్తు పోయేలా చేసింది. ఓట్ల శాతంలో చాలా తక్కువ తేడా ఉన్నప్పటికీ భారీ మెజారిటీ రావడం పై పలు అనుమానాలు వ్యక్తం చేశారు వైసీపీ చీఫ్ జగన్ రెడ్డి.