ఆకట్టుకున్న డ్రోన్ షో అద్భుత ప్రదర్శన
5,500 డ్రోన్లతో కనువిందు చేసిన డ్రోన్ షో
విజయవాడ – కృష్ణమ్మ సాక్షిగా ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ షో అలరించింది. వేలాది మందిని ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు కింజరాపు అచ్చెం నాయుడు, బిసి జనార్దన్ రెడ్డి, కొండపల్లి శ్రీనివాసరావు తిలకించారు. ఆనందం వ్యక్తం చేశారు.
ఈ డ్రోన్ ప్రదర్శన ఏకంగా ఐదు ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. అంతే కాకుండా ఆహుతులను మైమరిచి పోయేలా చేసింది. ఆ తర్వాత చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు మనసు దోచుకున్నాయి.
రాత్రి విజయవాడలోని పున్నమి ఘాట్ వద్ద 5,500 డ్రోన్లతో ప్రదర్శించిన డ్రోన్ షో వినీలాకాశంలో అద్భుత కనువిందు చేసింది.
భారతదేశ మొదటి వైమానిక తపాలా, విమానయానం, గౌతమ బుద్ధుడు, భూగోళం మీద భారతదేశం, వివిధ రంగాలలో డ్రోన్ల వినియోగం, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ లోగో, త్రివర్ణ పతాకం ఈ డ్రోన్ల ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రదర్శనతో సందర్శకులు సంబ్రమాశ్చర్యాలకు గురయ్యారు. డ్రోన్ షో ను ఆధ్యాంతం ఆస్వాదించి ప్రదర్శనను తమ సెల్ ఫోన్లలో బంధించారు.
కృష్ణమ్మ నడిబొడ్డున ప్రదర్శించిన ఈ డ్రోన్ షో 5 ప్రపంచ రికార్డులను నెలకొల్పినట్లు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు ప్రకటించి రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు అందించారు. శాస్త్రీయ నృత్యం, ఆక్రోబయోటిక్ ప్రదర్శన, కియోరి బృందం బ్యాండ్ ప్రదర్శన అమితంగా ఆకట్టుకున్నాయి.
అదేవిధంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన వరాహ రూపం.., బొమ్మ బొమ్మ తై తై.., అయిగిరి నందిని మహిషాసుర మర్దిని.., శంభో శివ శివ శంభో.. వంటి భక్తి గీతాలు, ఘల్లు ఘల్లు జోడెద్దుల పరుగు చూడు తందనాన తానా వంటి జానపద నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.