ఉబర్ డ్రైవర్ కుటుంబాన్ని ఆదుకోవాలి
టీజీపీడబ్ల్యూయు ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్
హైదరాబాద్ – డ్యూటీలో ఉండగానే మృతి చెందిన ఉబెర్ బైక్ ట్యాక్సీ డ్రైవర్ జి. శ్యాం సుందర్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ గిగ్ , ప్లాట్ ఫార్మ్ వర్కర్స్ యూనియన్ (టీజీడబ్ల్యూపీయూ) అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన పట్ల తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఈ ఘటన గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రమాదాలను వెల్లడించడమే కాకుండా, తెలంగాణలో అక్రమంగా బైక్ టాక్సీలు నడుపుతున్న అగ్రిగేటర్ కంపెనీలు ఉబర్, ఓలా, రాపిడోల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోందని ధ్వజమెత్తారు షేక్ సలావుద్దీన్.
బైక్ టాక్సీలు తెలంగాణలో చట్టబద్ధం కానిప్పటికీ, ఉబర్, ఓలా, రాపిడో వంటి కంపెనీలు ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోక పోవడంతో నిబంధనలకు విరుద్ధంగా సేవలు కొనసాగిస్తున్నాయని ఆరోపించారు. ఇది డ్రైవర్ల జీవితాలను ప్రమాదంలో పడేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు షేక్ సలావుద్దీన్.
వర్క్‌మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం జి .శ్యామ్ సుందర్ కుటుంబానికి న్యాయమైన పరిహారం ఇవ్వాలని, ప్రభుత్వం హామీ ఇచ్చిన రూ. 5 లక్షల బీమా సత్వరమే విడుదల చేయాలని, ఉబర్ వర్క్‌మెన్ కాంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్‌పోర్ట్ చట్టాలను కఠినంగా అమలు చేసి అక్రమ బైక్ టాక్సీలను నిలిపి వేయాలని ఆయన కోరారు.