ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం – అనిత
మహిళలకు తీపి కబురు చెప్పిన సర్కార్
అమరావతి – ఏపీ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మంత్రులు నాదెండ్ల మనోహర్, కొలుసు పార్థ సారథితో కలిసి అనిత వంగలపూడి మీడియాతో మాట్లాడారు.
తాము ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని అన్నారు. అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తామని చెప్పామన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఖజానాపై దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా అదనపు భారం పడుతున్నా లెక్క చేయకుండా సీఎం మహిళలకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారని చెప్పారు. తాము హామీలు ఇవ్వమని, కానీ ఇస్తే మాత్రం తప్పే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు వంగలపూడి అనిత.
ఈ ఉచిత మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అక్టోబర్ 31 న దీపావళి పండుగ సందర్భంగా ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇవాళ జరిగిన కేబినెట్ పూర్తిగా ఈ నిర్ణయానికి కట్టుబడి తీర్మానం చేసిందన్నారు. ప్రజలందరికీ మేలు చేకూర్చేలా తాము ప్రయత్నం చేస్తున్నామని అన్నారు వంగలపూడి అనిత.