సరిహద్దు శాంతి..పరస్పర విశ్వాసం ముఖ్యం
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ప్రధాని మోడీ
రష్యా – భారత్, చైనా దేశాల మధ్య సరిహద్దు శాంతి, పరస్పర విశ్వాసం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీ. రష్యాలోని కజాన్ లో జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత ఇద్దరూ కలుసు కోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను, ఉద్రిక్తతలను తగ్గించు కోవాలని సూచించారు రష్యా చీఫ్ వ్లాదిమిర్ పుతిన్. ఈ మేరకు ఇరు దేశాల మధ్య సయోధ్యను కుదిర్చారు.
మోడీ, జిన్ పింగ్ లు విస్తృతంగా చర్చలు జరిపారు. ఒక అవగాహన ఒప్పందానికి వచ్చారు. గత కొన్ని సంవత్సరాలుగా అనేక అవాంతరాలను ఎదుర్కొన్న వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి పెట్రోలింగ్ ఏర్పాటుపై ఏకాభిప్రాయం వచ్చింది. భారత్, చైనా సంబంధాలలో పురోగతి కనిపించింది.
ఈ సందర్బంగా ప్రధానమంత్రి మోడీ మాట్లాడారు. బ్రిక్స్ సదస్సు వేదికగా జిన్ పింగ్ ను కలవడం ఆనందంగా ఉందన్నారు. భారత దేశం, చైనా సంబంధాల ప్రాముఖ్యత కేవలం రెండు దేశాలకు చెందిన ప్రజలకు మాత్రమే కాదని , మొత్తం ప్రపంచానికి శాంతి, స్థిరత్వం, పురోగతికి కూడా చాలా ముఖ్యమైనదని స్పష్టం చేశారు. నెలకొన్న సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించు కోవాలని నిర్ణయించుకున్నందుకు జిన్ పింగ్ కు అభినందనలు తెలియ చేస్తున్నానని అన్నారు మోడీ.